YCP MLA chevireddy visits TRS Meeting Place

టీఆర్ఎస్ సభాస్థలం వద్ద వైసిపి ఎమ్మెల్యే ప్రత్యక్షం

తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ ఇబ్రహీంపట్నం సమీపంలోని కొంగర కలాన్ వద్ద "ప్రగతి నివేదన" పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సభకోసం అక్కడ భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఇవాళ అక్కడ ఓ ఆసక్తకరమైన సన్నివేశం కనిపించింది. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు ఇక్కడ ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.
చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇవాళ కొంగర కలాన్ లో హల్ చల్ చేశారు. సెప్టెంబర్ రెండో తేదీన అధికార టీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన ప్రగతి నివేదన సభ వద్ద ఏర్పాట్లను పరిశీలీంచడానికి హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ అక్కడే వున్నారు. దీంతో అతన్ని కలవడానికి ఇక్కడికి వచ్చినట్లు చెవిరెడ్డి తెలిపారు. వ్యక్తిగత పనిపైనే మేయర్ ను కలిసినట్లు ఇందులో రాజకీయాలేమీ లేవని చేవిరెడ్డి తెలిపారు.


అయితే చెవిరెడ్డికి సంబంధించిన వాహనాలును ఈ సభా ఏర్పాట్ల కోసం వాడుతున్నారు. దీంతో వాటి వ్యవహారాలను చూసుకోడానికే ఆయన ఇక్కడికి వచ్చినట్లు సమాచారం. కేవలం బిజినెస్ పనుల్లో భాగంగానే చెవిరెడ్డి వచ్చినట్లు టీఆర్ఎస్ వర్గాలు కూడా చెబుతున్నాయి.   

Comments